మీర్ జుంలా, పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి భారతదేశం చేరాడు. స్వయంగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోల్కొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగాడు. విజయనగర సామ్రాజ్యములో వజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుమ్లా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడున్నాడు. ఎన్నోరోజులు భీకర యుద్ధం జరిగినను కోట వశముకాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారినాయి . క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చి కోటగోడలు బద్దలు చేయుటలో కృతకృత్యుడైనాడు .
రాక్షస - తంగడి యుద్ధం తరువాత, విజయనగర సామ్రాజ్య పతనానంతరం గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా సైన్యాధికారి మీర్ జుమ్లా మొదట సిద్దవటం కోటను స్వాధీనం చేసుకుని తరువాత క్రీ. శ 1650లలో గండికోటపై దండెత్తాడు. తన సైనిక బలం కంటే మీర్ జుమ్లా సైనిక బలం ఎన్నో రెట్లు ఎక్కువైనా- ఏ మాత్రం అధైర్య పడక పెమ్మసాని చిన్న తిమ్మానాయుని నేతృత్వంలో గండికోట వీరోచితంగా పోరాడింది. చిన్న తిమ్మానాయుని తరపున గోవిందమ్మ భర్త శాయపనేని నరసింహానాయుడు కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. మీర్ జుమ్లా సైన్యంలోని అబ్దుల్ నబి అనే వ్యక్తి చేతిలో నరసింహనాయుడు మరణించాడు.
భర్త చనిపోయిన తర్వాత సతీసహగమనం చేయకుండా, అన్న వారిస్తున్నా వినకుండా నిరాశా నిస్పృహలకు గురికాకుండా గోవిందమ్మ స్వయంగా కదనరంగంలోకి దూకింది. వీరోచితంగా పోరాడి తన భర్తను చంపిన అబ్దుల్ నబిని వెతికి చంపుతుంది. అయితే అదే యుద్ధంలో అబ్దుల్ నబీ విసిరిన కత్తికి గోవిందమ్మ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందింది. గోవిందమ్మ పోరాట యోధురాలే కాక మంచి పాలనాదక్షురాలు కూడా.
చిన్నతిమ్మానాయుడు గండికోటను ఏలుతున్న సమయంలో, తన సోదరి గోవిందమ్మకు విజయ భారతీపురం (కుడిపి కుంట) అనే గ్రామాన్ని జాగీర్ గా ఇచ్చాడు. అప్పటికే ఆ గ్రామం శిథిలావస్థలో వుంది. గోవిందమ్మ ఆ గ్రామాన్ని పునర్మించి ఆ గ్రామానికి గోవిందమ్మ పేట అని నామకరణం చేసింది. ఆ ఊరే నేటి కడపజిల్లా జమ్మలమడుగు తాలూకాలోని ఫకీర్ పేట గ్రామం. ఇటువంటి వీరనారి చరిత్ర దురదృష్టవశాత్తూ మరుగున పడిపోయింది.
Comments
Post a Comment