Kamma community meeting at Bargarh - Orissa






Kamma Community meet at Bargarh - Orissa on 18th September

బర్గఢ్ (Bargarh) జిల్లా కేంద్రం - ఒరిస్సాలో 18 సెప్టెంబర్ తేదీన కమ్మవారి ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అత్తబిర, బర్గఢ్, సంబల్పుర్, కలహండి, భవానిపట్న, జయపట్న, దరంగఢ్ ఏరియాల నుండి కమ్మ పెద్దలు పాల్గొన్నారు. ఈ ఏరియాల్లో కమ్మవారు 105 క్యాంపుల్లో కమ్మవారి జనాభా సుమారు 35,000 వరకు ఉంటుంది.  

అత్తబిర ఏరియాలో కమ్మవారి జనాభా సుమారు 20,000. బర్గఢ్ లో 10,000, కలహండి లో 5,000 వరకు ఉంటుంది. 

మహానది పై నిర్మించిన హిరాకుడ్ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతానికి కమ్మవారు మొదటిసారి 1960లో వచ్చి స్థిరపడ్డారు. నీటి వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో వరి ప్రధాన పంట. అత్తబిర, బర్గఢ్ ఏరియాలో కమ్మవారు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. ఈ ఏరియాల్లో ఉభయ గోదావరి జిల్లాల నుండి వచ్చిన కమ్మవారు 90% పైగా ఉంటారు. ఎక్కువ మంది వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండి క్రమేపీ రైస్ మిల్లులు, ఆటోమొబైల్ వ్యాపారం లోకి విస్తరించారు. ఈ చుట్టుపక్క ఏరియాల్లో ఉన్న ట్రాక్టర్ షోరూంలన్నీ మనవారివే.

ఇక్కడ కమ్మవారు స్కూల్స్, కాలేజీలు స్థాపించారు. 1979లో అత్తబిర లో మనవాళ్ళు స్థాపించిన కోసల స్కూల్ ఒరిస్సా రాష్ట్రంలో మొట్టమొదటి బోర్డింగ్ స్కూల్. సిద్దార్థ స్కూల్, కాలేజీ (కొమ్మిలిసింగ), ఆదిత్య స్కూల్ (సంబల్పుర్), సెవెన్ హిల్స్ (సంబల్పుర్) మనవాళ్ళు స్థాపించిన కొన్ని పాఠశాలలు. బర్గఢ్ పట్టణంలో మనవారు స్థాపించిన 'వికాష్ ' గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ 22 పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రూప్ లో ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ, మేనేజ్మెంట్ స్కూల్ కూడా ఉన్నాయి. వీరు బర్గఢ్ పట్టణంలో 150 పడకల వికాష్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్నారు. వీరికి మెడికల్ కాలేజీ స్థాపనకు అనుమతి లభించింది, త్వరలోనే మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. 

ఇక్కడ ఆనంద కళ్యాణ మంటపం, కోసల అనాధ శరణాలయం మనవాళ్ళు సేవాభావంతో నిర్వహిస్తున్నారు. 

వికాష్ గ్రూపు చైర్మన్ శ్రీ దాసరి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీ వల్లూరి శ్రీనివాస రావు, శ్రీ కోరా వరప్రసాద్, శ్రీ బిక్కిని పాపారావు, శ్రీ కొరిపిల్లి పెద శ్రీనివాసరావు, శ్రీ పుట్టా రమణ మూర్తి మొదలైన ఈ ప్రాంత ప్రముఖులు, ఆంధ్ర ప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి -  శ్రీ బెజవాడ వెంకట్రావు, ఉపాధ్యక్షులు - శ్రీ మురకొండ బోసుబాబు, కార్యదర్శి - కనకమేడల శ్రీనివాస చక్రవర్తి, దవణగిరి - కర్ణాటక కమ్మ సంఘ అధ్యక్షులు శ్రీ వల్లూరి వెంకట్రావు పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు త్వరలోనే అన్ని క్యాంపుల్లో వారితో సమావేశం ఏర్పాటు చేసి కమ్మ సమాజం ఏర్పాటు విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు.

Comments